Vangaveeti Radha: విజయవాడ పవన్ సభలో వంగవీటి రాధా క్రేజ్ మామూలుగా లేదు!

Vangaveeti Radha speech in Vijayawada
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వారాహి సభ
  • పవన్ కల్యాణ్ తో పాటు హాజరైన టీడీపీ నేత వంగవీటి రాధా
  • రాధా ప్రసంగిస్తుండగా నినాదాలతో హోరెత్తించిన ప్రజలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారు. సొంతగడ్డ విజయవాడలో జరుగుతున్న సభ కావడంతో జనాల్లో ఆయన క్రేజ్ మామూలుగా లేదు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మరీ రాధాకు మైక్ అందించారు. దాంతో సభకు హాజరైన ప్రజలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. 

రాధా తన ప్రసంగాన్ని నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించడంతో మొదలుపెట్టారు. "130 సార్లు బటన్ నొక్కాను, బటన్ నొక్కాను అని ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతోంది. ఆ సింహానికి విశ్రాంతినిద్దాం. మన కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుందాం. సింహాలు, పులులు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజా నాయకులు. 

జగన్ రెడ్డి బటన్ నొక్కాను అంటున్నారు... అయ్యా మీరెంత నొక్కేశారో కూడా ప్రజలందరికీ చెబితే బాగుంటుంది! తగ్గాను, తగ్గాను అని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఎక్కడ తగ్గారని నేనంటున్నాను. జనసేనాని పవన్ ఒక్క పిలుపు ఇస్తే 175 నియోజకవర్గాల్లో జనసైనికులు అండగా నిలిచారు... అదీ ఆయన సత్తా!

ఇవాళ ఇది పార్టీల కూటమి కాదు... ప్రజలందరి కూటమి. మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాలకు భవిష్యత్తును ఇవ్వలేం. ఈ సందర్భంగా మా నాయకుడు రంగా గారు ఇచ్చిన పిలుపు "చేయి చేయి కలుపు... చేజారదు గెలుపు" అనే స్ఫూర్తితో ముందుకు వెళదాం. తప్పనిసరిగా జగన్ రెడ్డిని వెనక్కి పంపించేద్దాం. 

పులివెందులా... 'పీకే'నా!... పులివెందులా... పిఠాపురం, కుప్పమా...! ఎవరు విజేత?" అంటూ రాధా ఉత్తేజభరితంగా ప్రసంగించారు. కాగా, రాధా ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. ప్రజల్లో కనిపిస్తున్న ఆ ఉత్సాహాన్ని వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ కూడా ఆస్వాదించారు.

  • Loading...

More Telugu News